చిన్నారులు సరదాగా మొదలు పెట్టిన కబడ్డీ ఆట విషాదంగా ముగిసింది. కబడ్డీ ఆడుతున్న 14 ఏళ్ల విద్యార్థినిని దారుణంగా పొడిచి చంపిన ఘటన మహారాష్ట్ర పుణెలో జరిగింది. బిబ్వేవాడిలోని యష్ లాన్స్ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
క్షితిజ అనే బాలిక తన స్నేహితులతో కలిసి యష్ లాన్స్ ప్రాంతంలో కబడ్డీ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో.. బాలికకు బంధువు వరసైన ఓ వ్యక్తి తన స్నేహితులతో సహా ఆ ప్రదేశానికి వచ్చాడు. క్షితిజతో మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనితో ఆ యువకుడి నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించింది. అతడు వెంటపడి ఆమెను కింద పడేశాడు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఆమె మెడపై కత్తితో పొడిచాడు. చనిపోయిందని నిర్ధరించుకున్న తరువాత అక్కడినుంచి పరారయ్యాడు.
హత్యకు ఉపయోగించిన కొడవలి, ఇతర ఆయుధాలను నిందితుడు అక్కడే వదిలి వెళ్లాడని పోలీసులు తెలిపారు. బాలికపై దాడి చేస్తుండగా అడ్డుకున్న వారిని తన వద్ద ఉన్న తుపాకీతో బెదిరించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే ఆ తుపాకీని సైతం అక్కడే విసిరి పారిపోయాడని.. దానిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక హత్యలో ప్రధాన నిందితుడైన 22 ఏళ్ల రిషికేష్ భగవత్‌ను అరెస్టు చేశారు. అతనికి సహకరించిన మరో ముగ్గురు మైనర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. ‘నిందితుడు బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడని.. తన శరీరం నుంచి తలను వేరు చేయడానికి ప్రయత్నించాడని’ డీసీపీ నమ్రత తెలిపారు.