దేశంలో బొగ్గు నిల్వల కొరతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. పంజాబ్, యూపీ, కేరళ, బిహార్ ప్రభృత రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని ప్లాంట్లు మూతపడగా, తక్కినవి సగం సామర్థ్యంతోనే నడుస్తుండటం పొంచి ఉన్న ముప్పును ప్రస్ఫుటీకరిస్తోంది.
మనిషికి శ్వాసలాగా జాతికి విద్యుత్ ప్రాణావసరంగా మారిపోయిన రోజులివి. కొవిడ్ మహమ్మారి దుష్ప్రభావాలతో కుదేలైన పరిశ్రమలు, వ్యవసాయం సహా భిన్నరంగాలు ఇప్పుడిప్పుడు గాడిన పడుతుండగా- బొగ్గు కొరత మూలాన దేశంలో పలుచోట్ల విద్యుత్ సంక్షోభం ముంచుకొచ్చే సూచనలు హడలెత్తిస్తున్నాయి. ఏపీలో కరెంటు కోతలు త్వరలో తథ్యమన్న సంకేతాలు చిమ్మచీకట్లు ముసురుతున్నట్లు స్పష్టీకరిస్తున్నాయి.
వివిధ రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటడానికి ఇవీ కారణాలంటూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఒక జాబితా క్రోడీకరించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో విద్యుత్తుకు గిరాకీ పెరగడం, గనుల ప్రాంతాల్లో ఇటీవలి భారీ వర్షాలు, దిగుమతి చేసుకునే బొగ్గు ధరల ప్రజ్వలనం.. ఇవే ప్రస్తుత కొరతకు దారి తీశాయంటోంది.
అత్యధిక బొగ్గు నిల్వలున్న దేశాల జాబితాలో ఇండియాది అయిదోస్థానం. గిరాకీ, సరఫరాల మధ్య అగాధంవల్ల విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానాన నిలవాల్సి వస్తోంది. దేశంలోని 70 వరకు విద్యుత్ కేంద్రాల్లో రెండుమూడు రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలే మిగిలాయి. సాధారణంగా రెండు వారాలకు సరిపడా నిల్వలు ఉండాలి!