రబీ సాగు సీజన్‌లో రైతులకు పోషకాలతో కూడిన ఎరువులు సరసమైన ధరకు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-మార్చి కాలంలో ఫోస్ఫాటిక్, పొటాసిక్ ఎరువులపై రూ.28,655 కోట్ల రూపాయల నికర సబ్సిడీ అందించే నిర్ణయానికి ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. డీఏపీపై కూడా కేంద్రం రాయితీని పెంచింది. డీఏపీపై రూ.438, ఎన్పీకే గ్రేడ్ 3 రకాల ఎరువులపై సంచికి రూ.100 వరకు రాయితీ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్‌లో కూడా డీఏపీపై రాయితీని కేంద్రం 50 కేజీల బస్తాకు 140 రూపాయలు సబ్సిడీని పెంచింది.
మొలాసిస్ నుంచి ఉత్పత్తి అయ్యే పొటాష్‌పై తొలిసారిగా సబ్సిడీని అందించాలని కేంద్రం నిర్ణయించింది. 50 కేజీల బస్తాపై రూ.73 సబ్సిడీని నిర్ణయించింది. పోషకాలతో కూడిన ఎరువుల ధరను 2021 జూన్‌లో పెంచిన కేంద్రం దాని అమలును 2022 మార్చి వరకు కొనసాగించాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అయితే రేట్లలో మార్పు లేకున్నా అదనపు సబ్సిడీ కోసం ఏక కాలంలో అందించే రూ.6500 కోట్ల వల్ల రీటైల్ ధరలు స్ధిరంగా ఉండేందుకు దోహదపడనుంది.