తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి హైకోర్టు ఫస్ట్ కోర్టు హాలు వేదిక కానున్నది. కొత్త న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ ప్రమాణం చేయిస్తారని రిజిస్ట్రార్ జనరల్ అనుపమ చక్రవర్తి తెలిపారు.
తెలంగాణ హైకోర్టు ఏర్పడ్డాక తొలిసారి ఏడుగురు న్యాయాధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. కొత్త న్యాయమూర్తులు ఈ నెల 18న ప్రమాణం చేయాలని తొలుత భావించారు. విజయదశమి పండుగ నాడు ప్రమాణం చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో తేదీని శుక్రవారానికి మార్చారు. ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణం చేయనుండటం అందులో నలుగురు మహిళలే కావడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.