కొంతకాలంగా రాజకీయంగా నిస్తేజంగా ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉన్నట్టుండి జిల్లా రాజకీయ క్షేత్రంపై తళుక్కున మెరిశారు. సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ సీనియర్ దళిత నాయకుడికి టీఆర్‌ఎస్ అధిష్టానం డబుల్ ధమాకా ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
సోమవారం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న మోత్కుపల్లిని రాష్ట్ర దళిత బంధు చైర్మన్‌గా నియమిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే, ఈ హోదాతో పాటు ఆయన్ను పెద్దల సభకు పంపే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని, సీనియర్ దళిత నాయకుడికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకే ఆయన రెడీ అయ్యారని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఉదయం 12 గంటలకు బేగంపేట లీలానగర్‌లోని మోత్కుపల్లి నివాసం నుంచి బైక్ ర్యాలీతో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ప్రగతిభవన్‌కు వెళ్లేముందు ట్యాంక్‌బండ్ పైనున్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడినుంచి గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు.
ప్రగతి భవన్ చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతారు. ఈ కార్యక్రమానికి ఆయన అనుచరులు పెద్దఎత్తున హాజరు కానున్నారు. ఆయనతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది.