వైకాపా పాలన తాలిబన్ల పాలనను మించిపోయింది: డాక్టర్ తులసిరెడ్డి

Vaikapa rule surpasses Taliban rule: Dr. Tulsireddy

0
96

రాష్ట్రంలో వైకాపా పాలన తాలిబన్ల పాలనను మించిపోయిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం వేంపల్లెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం రావణ కాష్టం అయిందని, ఆటవిక పాలన సాగుతుందని, రాక్షస రాజ్యం, రౌడీల రాజ్యంగా తయారైందని అన్నారు. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కరువైందన్నారు.

నిన్నటి రోజు ఏక కాలంలో రాష్ట్రంలోని అనేక చోట్ల టీడీపీ కార్యాలయాలపై, నాయకులపై వైకాపా శ్రేణులు దాడులు చేయడం అ ప్రజాస్వామ్యానికి, అరాచకానికి, రాజ్యహింసకు పరాకాష్ట అన్నారు. డీజీపీ కార్యాలయానికి ప్రక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులను అరికట్టలేని పోలీసు వ్యవస్థ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో శాంతి భద్రతలను ఎలా కాపాడుతుందని తులసిరెడ్డి ప్రశ్నించారు. దాడులు చేసిన దుండగులు ఎవరనేది స్పష్టంగా కనిపిస్తోందని, అయినప్పటికి వారిపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎప్పటికైనా గాంధేయవాదం , అహింసావాదం, ప్రజాస్వామ్యం గెలుస్తాయని తులసిరెడ్డి అన్నారు.

కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా జగన్ పాలనలో కరెంటు ఛార్జీలు పెరిగాయని, వైకాపా అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని తులసిరెడ్డి అన్నారు. 2020వ సంవత్సరంలో కరెంటు ఛార్జీలు రెంచుసార్లు పెంచి వినియోగదారులపై రూ.2,800 కోట్ల అదనపు భారం మోపిందని, 2021 ఏప్రిల్ లో కొత్త టారిఫ్ ఛార్జీల పేరుతో మళ్ళీ రూ.2600 కోట్ల భారం మోపిందని, ఇది చాలక ప్రస్తుతం సర్దుబాటు చార్జీల పేరుతో రూ. 3,669 కోట్ల భారం మోపిందని విమర్శించారు.

వెలిగించకుండానే వంటగ్యాస్ మండుతోంది. కాంగ్రెస్ పాలనలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.410 ఉండేదని, ప్రస్తుతం మోడీ పాలనలో పదవ సెంచరీకి సమీపంలో ఉందని అన్నారు. వెలిగించకుండానే వంటగ్యాస్ మండేటట్లుందనీ, పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటాయన్నారు. బద్వేలు ఉపఎన్నికల్లో వైసీపీ, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పాలని తులసి రెడ్డి కోరారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, నరసింహారెడ్డి, ఉత్తన్న, సుబ్బారాయుడు, సత్తార్ పాల్గొన్నారు.