పెరగనున్న అగ్గిపెట్టె ధర..14 ఏళ్ల తరువాత ఇప్పుడే మళ్లీ

The price of matches will go up..do you know how much?

0
77

అగ్గి పెట్టె ధరలు 14 ఏళ్ల తరవాత పెరగనున్నాయి. ఇప్పటివరకు రూ.1కి విక్రయిస్తున్న అగ్గిపెట్టెను డిసెంబరు 1 నుంచి రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థలు ప్రకటించాయి. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి.

రెడ్‌ ఫాస్ఫరస్‌ ధర రూ.425 నుంచి రూ.810కి, మైనం ధర రూ.58 నుంచి రూ.80కి పెరిగిందని పేర్కొన్నారు. బాక్స్‌ బోర్డులు, పేపర్‌, పొటాషియం క్లోరేట్‌, గంధకం వంటి ధరలు కూడా పెరిగాయని చెబుతున్నారు. ఇంధన ధరల వల్ల రవాణా ఛార్జీలు భారమయ్యాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించి 5 సంఘాలు శివకాశీలో సమావేశమై, ధరలు పెంచాలని నిర్ణయించాయి.

ఒక అగ్గిపెట్టె ధరను 50 పైసల నుంచి రూ.1కి పెంచుతూ 2007లో నిర్ణయం తీసుకోగా, మళ్లీ ఇప్పుడు పెంచుతున్నారు. ఇప్పటివరకు 600 అగ్గిపెట్టెల బాక్సును రూ.270-300కి తయారీదార్లు విక్రయిస్తుండగా, ఇకపై రూ.430-480కి పెంచాలని నిర్ణయించినట్లు నేషనల్‌ స్మాల్‌ మ్యాచ్‌బాక్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వి.ఎస్‌.సేతురథినమ్‌ తెలిపారు. దీనికి అదనంగా 12 శాతం జీఎస్‌టీ, రవాణా ఛార్జీలు కూడా ఉంటాయన్నారు.