ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా రాజేందర్ పోలింగ్ బూత్ వద్ద ప్రచారాన్ని నిర్వహించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. కమలాపూర్ మండలంలోని పోలింగ్ బూత్ నెం.262లో భార్య జమునతో కలిసి ఈటల రాజేందర్ శనివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..హుజురాబాద్ నియోజకవర్గంలో మద్యం ఏరులైపారిందని, రూ.వందల కోట్లు పంపిణీ చేశారని ఆరోపించారు. ప్రజలే బహిరంగంగా తమకు డబ్బు అందలేదని చెప్పడం రోడ్డెక్కడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని అభిప్రాయపడ్డారు. ‘సాదుకున్నా మీరే, చంపుకున్నా మీరే. మీ ప్రేమ, అభిమానం ముందు డబ్బులు, మద్యం. ఇవేమీ పని చేయవు’ అని ఈటల అన్నారు.
అయితే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన మాటలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయంటూ టీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈటల జమున సైతం ధర్మం, న్యాయమే గెలుస్తుందంటూ పోలింగ్ బూత్ ఆవరణలోనే మాట్లాడడం నిబంధనలకు విరుద్ధమని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెల్లవారుజాము నుంచే పోలింగ్ సెంటర్ వద్దకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. మధ్యాహ్నం 1 గంట వరకు 45.63 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం ఓట్లు 236873 కాగా ఇప్పటి వరకు 108082 ఓట్లు పోల్ అయ్యాయి.