నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణలో నియామకాలు అటకమీదకు ఎక్కినయ్. ఉద్యోగాలు లేక నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ఉద్యోగం రాలేదన్న బాధతో కొందరు ఆత్మహత్యలవైపు అడుగులేస్తున్నారు.
తాజాగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని వెల్మపల్లె గ్రామంలో నిరుద్యోగి అసంపల్లి మహేష్ (28) పత్తి చేను దగ్గర ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణ సమాజాన్ని ఆవేదనకు గురిచేసింది. మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య మహేష్ తో 141కి చేరిందని తెలంగాణ నిరుద్యోగ జెఎసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్ ఆరోపించారు. ఆత్మహత్యలతో కాకుండా పోరాటాలతో సర్కారు మెడలు వంచి ఉద్యోగాలు సాధించుకోవాలని కోటూరి విన్నవించారు. ఉద్యోగాల కోసం యువత కేసిఆర్ పై తిరగబడాలని పిలుపునిచ్చారు.
మహేష్ రాసిన సూసైడ్ నోట్ లో గుండెలు పిండే విషయాలు వెల్లడించారు. తనకు ఏ ఉద్యోగం రాలేదని, జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఉద్యోగం కొట్టలేకపోయానని లేఖలో పేర్కొన్నారు. కేసిఆర్ సార్ మీకు దండం పెడతా దయచేసి ఉద్యోగాలు భర్తీ చేయండి… నాలాగా మరింత మంది ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడండి అంటూ లేఖలో వేడుకున్నారు మహేష్. అంతేకాదు తన తండ్రి గురించి తల్లి గురించి, సోదరి గురించి లేఖలో ప్రస్తావించారు. వారిమీద తనకు ఎంత ప్రేమాభిమానాలు ఉన్నది సైతం లేఖలో రాశారు. బాపూ ఎక్కువ తాగకు.. ఆరోగ్యం జాగ్రత్త అని తన చివరి మాటలను సూసైడ్ లేఖలో రాసిపెట్టారు మహేష్.
లేఖలో రాసిన ప్రతి అక్షరం చదివేవారిని కంటతడిపెట్టించేలా ఉంది. దిగువన లేఖను ప్రచురిస్తున్నాం.