వెన్నెల కిషోర్‌ను మెచ్చుకున్న నాగార్జున

వెన్నెల కిషోర్‌ను మెచ్చుకున్న నాగార్జున

0
78

రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు2’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సమంత, కీర్తి సురేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘మన్మథుడు2’కు యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది.

మరోపక్క ఈ సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతిక బృందం గురించి ఇటీవల మాట్లాడిన నాగార్జున ఇప్పుడు ఇందులో కీలక పాత్ర పోషించిన వెన్నెల కిషోర్‌ గురించి ప్రత్యేకంగా ముచ్చటించారు. ”వెన్నెల కిషోర్‌ అంటే ఈ సినిమాకు నిజంగా వెన్నెలే. మమ్మల్ని తెగ నవ్వించాడు. షూటింగ్‌ చేసేటప్పుడు ఎంతలా నవ్వానో నాకే తెలియదు. ‘మన్మథుడు’ సినిమా చేసేటప్పుడు నవ్విన దానికంటే కొంచెం ఎక్కువే నవ్వాను. తను నా సోదరుడులాంటివాడు. రోజూ ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్లం. సాయంత్రం కలుసుకునేవాళ్లం. తెలుగు చిత్ర పరిశ్రమలోని టాలెంట్‌ ఉన్న నటుల్లో వెన్నెల కిషోర్‌ ఒకడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు” అని నాగార్జున చెప్పుకొచ్చారు. ‘మన్మథుడు2’ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌, ఆనంది ఆర్ట్స్‌ పతాకంపై నాగార్జున, పి.కిరణ్‌లు నిర్మిస్తున్నారు.