తాలిబన్ల పాలనతో అఫ్గానిస్థాన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. ఇక ఆడపిల్లల భవిష్యత్ పూర్తిగా ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో కొందరు వివిధ కారణాలతో తమ ఆడబిడ్డలను కూడా అమ్ముకుంటున్నారు. తాజాగా ఇలాంటి హృదయ విదారక సంఘటన ఒకటి అక్కడి దీన పరిస్థితులకు అద్దం పడుతోంది.
బద్ఘిస్ ప్రావీన్స్‌కు చెందిన అబ్దుల్ మాలిక్ తన కుటుంబ పోషణ కోసం రెండు నెలల క్రితం తన 12 ఏళ్ల కూతురిని అమ్మేశాడు. ఇప్పుడు రెండో కూతురికి కూడా అదే గతి పట్టించాడు . అది కూడా 55 ఏళ్ల ఓ ముసలాడికి పెళ్లి చేసి.’ నా కూతుళ్లను అమ్మాలనుకున్న నిర్ణయం నన్ను నిలువునా దహించివేస్తోంది. సభ్య సమాజం నన్ను దారుణంగా చూడవచ్చు. కానీ నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఇంతకన్నా వేరే మార్గం లేదు’ అని ఆ తండ్రి చెబుతున్న మాటలు అతని నిస్సహాయ స్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
తండ్రితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బద్ఘిస్ ప్రావీన్స్‌లో ఉన్న పర్వాన్‌ను తన ఇంటికి తీసుకెళ్లాడు ఆ 55 ఏళ్ల వృద్ధుడు. దీనికి బదులుగా అబ్దుల్ కుటుంబానికి రెండు లక్షల అఫ్గానీలు విలువ చేసే గొర్రెలు, భూమి, నగదును ఇచ్చాడు. ప్రపంచ దేశాలు చొరవచూపి అఫ్గాన్ ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు.