దళిత బంధు పథకం యథాతదంగా అమలవుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హూజూరాబాద్ నియోజకవర్గంతో కూడా సంపూర్ణంగా అమలవుతోందని చెప్పారు. ఏ బ్యాంకు బాదరబందీ లేకుండా, తిరిగి చెల్లించేటువంటి కిస్తీల కిరికిరి లేకుండా.. ఇచ్చే డబ్బుతో దళితులు పైకి రావాలన్నదే పథకం యొక్క ఉద్దేశం అని తెలిపారు. ప్రపంచలోనే ఇలాంటి పథకం ఎక్కడా లేదని, అణగారిన జాతులను ఆదుకోవడానికి రాష్ట్రంలో గొప్ప ప్రయత్నం జరుగుతుందన్నారు. తరతరాలు దోపిడికి గురైన జాతిని ఆదుకోవాలన్నదే తమ తాపత్రయమన్నారు. హుందాతనం ఉంటే ఇంత మంచి పనిలో కేంద్రం భాగస్వామి అవ్వాలన్నారు. 100 శాతం చెప్పింది చెప్పినట్టు దళిత బంధు స్కీమ్ అమలవుతుందని ముఖ్మమంత్రి హామి ఇచ్చారు. ఈ విషయంలో ఎవరి మాటలు నమ్మొద్దని దళితజాతిని కోరారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ముగిసేసరికి హుజూరాబాద్‌లో ప్రతి కుటుంబానికి దళిత బంధు డబ్బులు ఇస్తామన్నారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా 100 కుటుంబాలకు దళిత బంధు డబ్బు మార్చిలోపు అందజేస్తామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నామని.. దీనివల్ల 2 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని సీఎం తెలిపారు.