కశ్మీర్‌ ఎఫెక్ట్‌: నిలిచిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌

కశ్మీర్‌ ఎఫెక్ట్‌: నిలిచిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌

0
106

భారత్, పాక్‌ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది. భద్రతాపరమైన కారణాల నేపథ్యంలో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను వాఘా సరిహద్దు వద్ద నిలిపివేసినట్లు వారు తెలిపారు. దీంతో వాఘా-అటారీ మధ్య ప్రయాణికులు కాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ‘మధ్యాహ్నం 2.14 సమయంలో భద్రతాపరమైన కారణాల వల్ల రైలును వాఘా సరిహద్దు వద్ద నిలిపివేసినట్లు పాక్‌ నుంచి మాకు సమాచారం వచ్చింది. ఇబ్బందులు ఏమీ లేవు రైలు చేరుకోవాల్సిన సమయానికి కచ్చితంగా రావాలి.. అవసరమైతే మా సిబ్బంది రైలుకు రక్షణ కల్పిస్తారని చెప్పినట్లు’ భారత రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు భారత భద్రతా సిబ్బంది వాఘా సరిహద్దుకు చేరుకుని రైలును తీసుకొచ్చారు.. మరి కాసేపట్లో రైలు అటారీకి చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

మరో వైపు సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్‌ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ తెలపడం గమనార్హం. కాగా.. ఈ వార్తలపై భారత రైల్వే అధికారి దీపక్‌ కుమార్‌ స్పందించారు. పాక్‌ సిబ్బంది కారణంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ కొంతసేపు నిలిచిపోయిన మాట వాస్తవమేనని, ప్రస్తుతం రైలు సర్వీసు కొనసాగుతోందని చెప్పారు. రైలు రద్దయిందని చెప్పడం సరికాదని, దీనిపై పాక్‌ అధికారులు కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
1971లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా ఈ సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. సంఝౌతా అంటే ఒప్పందం అని అర్థం. 1976, జులై 22న రెండు దేశాల మధ్య ఈ రైలు సర్వీసును ప్రవేశపెట్టారు.