ప్లాస్టిక్‌ రహితంగా మేడారం జాతర..రూ.75 కోట్లు విడుదల

Madaram fair free of plastic..Rs 75 crore released

0
91

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కేసిఆర్ కి గిరిజన, ఆదివాసీల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.

సిఎం కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన, ఆదివాసీ జాతర గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత వైభవంగా జరుగుతోందన్నారు. కరోనా కష్టకాలం వల్ల బడ్జెట్ సమస్యలు ఉన్నప్పటికీ సమ్మక్క- సారలమ్మ జాతర-2022కు జీవో నెంబర్ 195 ద్వారా 75 కోట్ల రూపాయలను ఇవ్వడం అనేది గిరిజన, ఆదివాసీలు, వారి ఆచారాలు, పండగలు, జాతరల పట్ల సిఎం కేసిఆర్ కి ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని వర్గాల పండగలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. అన్ని కులాలు, మతాల వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించి, వారి పండగలు జరిపేందుకు నిధులు కేటాయించి, సెలవులు ప్రకటించి, అధికారికంగా నిర్వహిస్తూ అన్ని వర్గాలను గౌరవిస్తున్న ప్రభుత్వం ఇది అన్నారు.

గత ఏడాది కూడా 75 కోట్ల రూపాయలను అంతకుముందు వంద కోట్ల రూపాయలను సమ్మక్క- సారలమ్మ జాతరకు కేటాయించి, అక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించడం కోసం ఏర్పాట్లు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇప్పటికే అనేక శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక నిర్మాణాలతో మేడారంలో భక్తుల కోసం ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే జాతర కోసం వారం రోజుల కిందే 2.24 కోట్ల రూపాయలతో దుస్తులు మార్చుకునే గదులు, ఓ.హెచ్.ఆర్.ఎస్, కమ్యునిటీ డైనింగ్ హాల్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. మిగిలిన వసతులన్నీ కూడా డిసెంబర్ లోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు.

ఈ జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ మార్గదర్శనంలో అన్ని ప్రత్యామ్నాయ వసతులు కల్పిస్తున్నామని, దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళికలతో అధికారులు పనులు చేస్తున్నారన్నారు. అత్యంత చారిత్రక ప్రాశస్త్యం ఉన్న అతిపెద్ద ఆదివాసీ జాతరకు ముఖ్యమంత్రి 75 కోట్ల రూపాయలను విడుదల చేయడం పట్ల మరోసారి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నాలుగు రోజులపాటు జరిగే జాతరను ప్లాస్టిక్ రహితంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.