వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనున్న వైద్యారోగ్యశాఖను ఆయనకు అదనంగా అప్పగించారు. ఈ మేరకు సంబంధిత దస్త్రంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతకం చేశారు.
అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నారని ఈటల రాజేందర్‌పై ఆరోపణలు వచ్చిన సమయంలో ఈటల నుంచి వైద్యారోగ్య శాఖను తప్పించారు. శాఖను ఎవరికీ కేటాయించకుండా సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. ఆ తరువాత ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు.
అప్పటి నుంచి ముఖ్యమంత్రి వద్దే వైద్యారోగ్య శాఖ ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖను హరీశ్ రావుకు అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థికశాఖతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలను అదనంగా అప్పగించారు.