మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. కనీసం టీకా ఒక డోసు వేసుకున్నవారికి మాత్రమే రేషన్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డీలర్లు, ఏజెన్సీలకు ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని వారిపై విపత్తు యజమాన్య చట్టం, మహమ్మారి వ్యాధుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాక్సిన్ కార్యక్రమం మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
మహారాష్ట్రలో 74% మంది టీకాలు వేయించుకుంటే ఔరంగాబాద్‌లో అది 55 శాతం మాత్రమే. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో 26వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు ఈ కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ చర్యలతోనైనా వ్యాక్సిన్ పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు కొందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఆ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. దీంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి సంబంధిత సంస్థలు. కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని సిబ్బందికి జీతాలు చెల్లించబోమని ఇప్పటికే ప్రకటించింది మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ).