ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని చేపట్టిన మహా పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల మధ్యే రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. నాగులుప్పలపాడు నుంచి ముక్తినూతలపాడు వరకు రైతులు పాదయాత్ర చేయనున్నారు. పోలీసులను తోసుకుంటూ రైతులు ముందుకు కదులుతున్నారు.
ఏపీ ప్రకాశం జిల్లాలో ఎన్నికల కోడ్ ఉందంటూ పోలీసులు.. నాగులుప్పలపాడు వెళ్లే మార్గంలో రోడ్లను దిగ్బంధిస్తున్నారు. ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల నడుమ రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. అయితే మహా పాదయాత్రను కవరేజ్ చేస్తున్న మహా న్యూస్ టీంను పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తుంది.