ఏపీకి వాతావరణశాఖ అలర్ట్

Meteorological alert for AP

0
109

ఏపీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారింది. ఇది రాత్రి తొమ్మిది గంటలకు చెన్నైకి 430 కి.మీ., పుదుచ్చేరికి 420 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి గురువారం ఉదయానికి ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా రానున్నది. సాయంత్రం పుదుచ్చేరికి ఉత్తరాన శ్రీహరికోట-కరైకల్‌ మధ్య తీరం దాటనుంది.

ఆ సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ(భారత వాతావరణశాఖ) తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం ఉత్తర తమిళనాడులో ఎడతెరపిలేకుండా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురిశాయి. గురువారం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడ అసాధారణంగా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, కృష్ణా నుంచి విశాఖ జిల్లా వరకు కర్నూలులో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా, రానున్న 48 గంటల రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

నెల్లూరు. చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం తీరం దిశగా వచ్చే క్రమంలో కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమవుతాయని, నగరాలు, పట్ణణాల్లో వంతెనలు, అండర్‌పా్‌సలలో భారీగా నీరు చేరే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గురువారం ఉదయం నుంచే వెలుతురు బాగా తగ్గుతుందని, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొండ చరియలు, మట్టిపెళ్లలు విరిగిపడే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, బలహీనంగా ఉన్న ఇళ్ల నుంచి సురక్షిత భవనాలకు వెళ్లాలని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది.

వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతింటాయని పేర్కొంది. బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు రెండు రోజులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా, గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఇస్రో వాతావరణ శాఖ నిపుణుడొకరు తెలిపారు. ఇదిలావుండగా ఈనెల 13వ తేదీకల్లా దక్షిణ అండమాన్‌ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి, ఆ తరువాత 48 గంటల్లో మరింత బలపడి తమిళనాడు తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది.

కాగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కుండపోతగా వానపడుతోంది. జిల్లాలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ప్రతి మండలంలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు.