ఎపిసోడ్..ఎపిసోడ్‌కు బిగ్‌బాస్ రియాలిటీ షో రసవత్తరంగా మారుతోంది. బిగ్‌బాస్ రియాలిటీ షోలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌లో 5 రోజులు ఒకేత్తు అయితే శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే వీకెండ్ ఎపిసోడ్స్ మరో ఎత్తు అని చెప్పాలి. దారి తప్పుతోన్న హౌజ్‌మేట్స్‌ను సెట్ చేయాలన్నా, రకరకల టాస్క్‌లతో హౌజ్ మేట్స్‌కి సంతోషాన్ని పంచాలన్నా అది బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరించే వారికే దక్కుతుంది.
భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో హోస్ట్‌లు ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు హోస్ట్‌లు అందుబాటులో లేకపోతే వారి స్థానంలో మరొకరు బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరించిన సందర్భాలు చూసే ఉంటాం. తెలుగులో నాగార్జున సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటే సమంత హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా తమిళ బిగ్‌బాస్‌లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఇటీవల అమెరికా టూర్ వెళ్లొచ్చిన కమల్ హాసన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో రెండు వారాల పాటు కమల్ బిగ్‌బాస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే కమల్ స్థానంలో నటీమణి, కమల్ కూతురు శృతీ హాసన్‌ను తీసుకొచ్చేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కమల్ స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేస్తారో చూడాలి.