పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం రైతులకు మూడు విడతల్లో ఏటా రూ.6 వేలు నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 10 విడత నిధులను రిలీజ్ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
డిసెంబర్-మార్చ్ విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుమారు 1.57 లక్షల కోట్లను కేటాయించింది. డిసెంబర్ 15 నుంచి 25 మధ్య 10 విడత నిధులను రిలీజ్ చేసేందుకు కేంద్రం సమాయత్తమైందని సంబంధిత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఈ సారి కిసాన్ పథకంలో పశ్చిమ బెంగాల్‌లోని 15 లక్షల మంది రైతుల్ని కూడా కలపనున్నారు. దీంతో ఈ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య 11కోట్లు దాటనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి పీఎం కిసాన్ పథకానికి 65 వేల కోట్ల బడ్జెట్‌ను ఉపయోగించనున్నారు.