తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రులు, అధికారులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
అయితే కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కోసం సోమవారం ప్రయత్నించగా బిజీగా ఉండటంతో ఎవరూ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ తుగ్లక్ రోడ్ 23లోని సీఎం అధికారిక నివాసంలో సోమవారం విశ్రాంతి తీసుకున్నారు.
మంగళవారం ప్రధాని మోదీ, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ల అపాయింట్‌మెంట్‌ను సీఎంవో వర్గాలు కోరినా దీనిపై స్పష్టత రాలేదని తెలుస్తోంది. మరోవైపు ప్రధాని, కేంద్రమంత్రులను కలిసి గానీ తిరిగి హైదరాబాద్‌కు వెళ్లకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే ప్రధాని, కేంద్ర మంత్రులు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని..నేడో, రేపో కచ్చితంగా అపాయింట్‌మెంట్ వస్తుందని గులాబీ నేతలు చెబుతున్నారు.