ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కొద్ది రోజులుగా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివశింకర్ మాస్టర్ నిన్న సాయంత్రం కన్నుమూశారు.
శివశంకర్ భౌతిక కాయానికి రేపు (సోమవారం) మధ్యాహ్నాం 2 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంతకుముందు అభిమానుల సందర్శనార్థం మణికొండ పంచవటి కాలనీలోని తమ నివాసానికి మాస్టర్ భౌతిక కాయాన్ని తరలించనున్నారు. అయితే శివశంకర్ మాస్టర్ చనిపోయేముందు కొవిడ్ నెగిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఏఐజీ వైద్యులు తెలిపారు.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న శివశంకర్ మాస్టర్.. చెన్నైలో పుట్టారు. సలీమ్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేశారు. 800 చిత్రాలకు పైగా డ్యాన్స్ మాస్టర్‌గా చేశారు శివశంకర్. 30 చిత్రాల్లో నటించారు కూడా. 2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.