డాలర్ శేషాద్రిపై నెగెటివ్ కథనం రాస్తే ఎలా స్పందించాడంటే?

How would you react if you wrote a negative article on Dollar Seshadri?

0
82

డాలర్ శేషాద్రి అలియాస్ పాల శేషాద్రి. 2001లో హైదరాబాద్ నుంచి వార్త దిన పత్రికకు తిరుమల స్టాఫ్ రిపోర్టర్ గా వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం. మొదట్లో స్వామి అని పిలిచే నేను ఆ తరువాత కొందరు మిత్రుల లాగే మామ అని స్వామి అని పిలిచే వాడిని. క్రమంగా మా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఎక్కడ కనిపించినా ఎన్న నగేష్ నల్ల ఇరుక అని తమిళంలో పలుకరించేవారు.

తిరుమల శ్రీవారి ఆలయ విశేషాలు, స్వామి వారికి ఆకాశరాజు ఇచ్చిన కిరీటం నుంచి శ్రీ కృష్ణ దేవరాయలు, మహమ్మదీయ రాజులు, ఆంగ్లేయ పాలకుల నుంచి నేటి వరకు అందిన బంగారు, వజ్ర, కెంపు ఇతర ఆభరణాల వివరాలు ఆయన నోటి మీదే ఉంటాయి. ఏ ఆభరణం ఎప్పుడు ఎవరు కానుకగా ఇచ్చారు అందులో బంగారం ఎంత, వజ్రాలు ఎన్ని క్యారెట్లు ఉన్నాయి అనే సమస్త వివరాలు క్షణం ఆలోచించకుండా చెప్పగలిగే వ్యక్తి ఆయన.

ఆయనతో ఉన్న సాన్నిహిత్యం వల్ల 2002లో నేను తిరుపతి ఆంధ్రజ్యోతి జిల్లా ఇంచార్జ్ గా పని చేసిన సమయంలో మా ఎడిషన్ ఇంఛార్జ్ శ్రీ ఆర్ ఎం ఉమామహేశ్వరరావు సలహా మేరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఉన్న ఆభరణాలన్నింటి మీద ఆదివారం బుక్కుకు ఒక స్టోరీ చేయాలని అనుకున్నాను. ఇది నా కెరీర్ లో మంచి డాక్యుమెంట్ అవుతుందని ఎడిషన్ ఇంచార్జ్ శ్రీ ఉమామహేశ్వరరావు నన్ను ప్రోత్సహించి సహకారం అందించారు. శ్రీవారి ఆభరణాల సమస్త సమాచారం సంపాదించాలంటే అంత సులువు కాదు. అయినా, శేషాద్రి మామ ఉన్నాడు కదా అని ఒక రోజు తిరుమలలో ఆయన ఇంటికి వెళ్ళి విషయం చెప్పాను. ఒక రకంగా ఇదికూడా శ్రీవారి సేవేలే అని ఆభరణాల వివరాలు చెప్పడానికి శేషాద్రి స్వామి ఓకే చెప్పారు.

టీటీడీ ప్రజా సంబంధాల విభాగం సహకారంతో కొన్ని, శేషాద్రి స్వామి సహకారంతో మరి కొన్ని అపురూపమైన ఆభరణాల ఫోటోలు సంపాదించాను. ఇంకోరోజు ముందుగానే సమయం తీసుకుని శేషాద్రి స్వామి ఇంటికి వెళ్ళి ఒక్కో ఫోటో ఆయనకు చూపించడం దాని పూర్తి పేరు ఎప్పుడు ఎవరు కానుకగా ఇచ్చారు. అందులో బంగారు ఎంత, వజ్రాలు ఎన్ని అనే వివరాలు ఆయన చెబితే నోట్ చేసుకోవడం జరిగింది. ఈ పని పూర్తి కావడానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. నేను రాసిన కథనానికి ఉమా సర్ తుది మెరుగులు దిద్దారు. అప్పటి చీఫ్ రిపోర్టర్, ఇప్పటి నెట్ వర్క్ఇంచార్జ్ శ్రీ మాధవ్ సర్ బ్రిటీష్ హయాంలో దత్త మండలాల కలెక్టర్ సర్ థామస్ మన్రో స్వామి వారి ప్రసాదాల తయారీకి కానుకగా ఇచ్చిన గంగాళం వివరాలు జోడించి నా ద్వారా ఆ ఫోటో కూడా తెప్పించుకున్నారు. మిత్రుడు, ఫోటో గ్రాఫర్ ఐ. సుబ్రమణ్యం అలియాస్ సుబ్బు తన వంతు సహకారం అందించారు. పదిరోజుల తరువాత ఆంధ్రజ్యోతి ఆదివారం బుక్కులో వెంకన్నాస్ గోల్డ్  అనే శీర్షికన కవర్ పేజీ స్టోరీ వచ్చింది.

శనివారం రోజే ఈ ఆర్టికల్ ను నా బై లైన్ (పేరు)తో చూసుకున్న నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. సోమవారం రోజు ఒక బుక్కు తీసుకుని పోయి శేషాద్రి స్వామికి ఇచ్చి విలువైన సమాచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాను. చాలా బాగా రాశావని నన్ను ఆయన అభినందించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా శ్రీవారి ఆభరణాల గురించి కథనాలు రాయాలనుకునే చాలామంది జర్నలిస్టులకు నేను రాసిన వెంకన్నాస్ గోల్డ్ స్టోరీ సమాచారం కోసం ఉపయోగపడుతోందని చెప్పగలను. నా జర్నలిస్టు ప్రయాణంలో ఇలాంటి ఒక మైలు రాయి దాటడానికి శేషాద్రి మామ సహకారం ఎంతో ఉపయోగపడింది.
ఇక పోతే మరోసారి శేషాద్రి స్వామి గురించి ఆంధ్రజ్యోతిలో నెగటివ్ స్టోరీ రాయాలని ప్లాన్ చేశాము. నెగటివ్ అంటే ఆయన ఆలయ వైదిక కార్యక్రమాలతో సంబంధం లేకపోయినా అందులో ఇన్వాల్వ్ కావడం, ప్రముఖులు ఎవరు వచ్చినా ఫోటోల కోసం వారితో కలిసి నుల్చోవడం లాంటివి మాత్రమే. డాలర్ శేషాద్రి మీద స్టోరీ అంటే దాని ప్రాధాన్యత ఎలా ఉంటుందో వేరుగా చెప్పాల్సిన పనిలేదు. అది మెయిన్ పేజీ బ్యానర్ స్టోరీ అయ్యింది. శేషాద్రి స్వామి నిలువెత్తు ఫోటో వేశారు. అది కూడా సంచలనమే.

నాకు తెలిసినంత వరకు అప్పటి దాకా బహుశా శేషాద్రి స్వామి మీద ఈ తరహా స్టోరీ రాసిన వారు లేరు. అందుకే ఆ స్టోరీకి విపరీతమైన స్పందన వచ్చింది. మూడు రోజుల తరువాత తిరుమలలో శేషాద్రి స్వామిని కలిశాను. అంతకుముందు పలుకరింపునకు ఆ రోజు పలుక రింపునకు ఏ మాత్రం తేడా లేదు. కొంత సేపటి తరువాత నా ఫోటో చాలా బాగా వేశావు. నీ పనినువ్వు చేశావులే అని నవ్వుతూ చాలా సింపుల్ గా మాట్లాడారు. స్వామి వారికి సేవ చేయడం అంటే నాకు పిచ్చి అందుకే వైదిక కార్యక్రమాల్లో అర్చకులు, అధికారులకు సహాయం చేస్తూ ఉంటానని చెప్పారు. ఇక ఫోటోల గురించి మాట్లాడుతూ..ప్రముఖులతో ఫోటోలు దిగడం నా కొక సంతోషం అంతే. ఈ పరిచయాలను ఎప్పుడూ నా సొంతానికి ఉపయోగించుకోలేదు. ఇక మీదట కూడా ఉపయోగించు కోను నగేష్ అని మెత్తగా చెప్పారు. అరే ఈ విషయం స్టోరీలో ఆయన మాటగా రాసుంటే బాగుండేది కదా అని నాకు అనిపించి అదే విషయం శేషాద్రి స్వామితో చెబితే ఏం పరవాలేదులే ఈ విషయం అందరికీ తెలుసు కదా అని సింపుల్ గా నవ్వారు.

అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా నేను ఒక్కడే కానీ, కుటుంబ సభ్యులతో కానీ స్వామివారి దర్శనానికి వెళ్ళిన సమయంలో ఆలయంలో శేషాద్రి మామ ఉంటే పలుకరించి పక్కకు తీసుకునే వారు.
ఈ మధ్య ఆయనకు గుండె సంబంధిత సమస్య వచ్చి చెన్నైలో వైద్యం చేయించుకుని వచ్చాక తిరుమలలో కలిశాను. ఆరోగ్యం బాగానే ఉందా స్వామి అని అడిగితే, దాని పని దానిది, నా పని నాది అని 43 సంవత్సరాల పాటు స్వామివారి సేవలోనే తరించిన శేషాద్రి స్వామి చెప్పారు. పవిత్రమైన కార్తీక మాసంలో విశాఖపట్నం లో టీటీడీ సోమవారం నిర్వహించే కార్తీక దీపోత్సవంలో పాల్గొని స్వామి వారి సేవ చేయాలని వెళ్ళిన శేషాద్రి స్వామి అక్కడే కన్నుమూశారు. డాలర్ మామకు నా అక్షర నివాళులు. ఆయన ఆత్మ శాంతించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ..

నగేష్ ఓఎస్డీ
టీటీడీ ప్రజాసంబంధాల విభాగం