తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. ఎప్పటి నుంచో టీఎస్‌ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సాగుతున్న చర్చ తాజాగా కొలిక్కి వచ్చింది. ఓ వైపు కరోనా.. మరోమైపు డీజిల్ ధరలు పెరగడంతో బస్సు చార్జీలు పెంచక తప్పదనే నిర్ణయానికి టీఎస్‌ఆర్టీసీ వచ్చింది.
ఇప్పటికే ఆర్టీసీ చార్జీల పెంపునకు సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ ముందుకు చేరింది. చార్జీల పెంపును ఆమోదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆర్టీసీ చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్ అతి త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా ఆర్డినరీ బస్సులో కిలోమీటర్‌కు 20 పైసల పెంపు, పల్లె వెలుగు బస్సుల్లో 25 పైసల పెంపు, అన్నీ ఇతర బస్సుల్లో 30 పైసల చొప్పున చార్జీలు పెంచాలని సజ్జనార్ ప్రతిపాదించారు. ఆ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. అప్పుల్లో కూరుకుపోయిన ప్రజారవాణా సంస్థ టీఎస్ఆర్టీసీపై డీజిల్ రూపంలో మరో పెనుభారం పడిందన్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ రోజూ కోట్లలో నష్టం చవిచూస్తోందని తెలిపారు. దీంతో చార్జీలు పెంచక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.
ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1440 కోట్ల నష్టం వచ్చిందని, అందుకే చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశామని సజ్జనార్ గుర్తు చేశారు. ఛార్జీలు పెరగం వల్ల ఆర్టీసీ మళ్లీ సాధారణ స్థితికి వస్తుందన్నారు. అన్ని ధరలు పెరిగాయని, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.