ఏపీలో ఆన్ లైన్ లో సినిమా టికెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. అదనపు షోలకు అనుమతి లేకపోవడం, టికెట్ రేట్ల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్ల అందరూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టికెట్ల అంశంపై తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.
చిత్ర పరిశ్రమలో తనకు 45 ఏళ్ల అనుభవం ఉందని, దర్శకుడిగానూ, నిర్మాతగానూ తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత టికెట్ల విధానంతో చాలా మంది తీవ్ర నష్టాలకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. థియేటర్లలో చూస్తే వచ్చే అనుభూతిని ప్రేక్షకుడు టీవీలో ఎప్పటికీ పొందలేడని తెలిపారు. ప్రదర్శనల సంఖ్య తగ్గించడం, టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నష్టపోతారని వివరించారు.
ఆన్ లైన్ విధానం వల్ల దోపిడీ ఆగిపోతుందనడం సరికాదని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడదలుచుకుంటే టికెట్ రూ.300 కాదు రూ.500 పెట్టి అయినా చూస్తాడని, అదే అతనికి నచ్చని సినిమాను టికెట్ రూపాయికే ఇచ్చినా చూడడని వివరించారు. పైగా ఆన్ లైన్ విధానంలో చాలామంది టికెట్లను బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని, అదే ఆన్ లైన్ లో రేట్లు పెంచి టికెట్లు అమ్మితే ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ వస్తుందని వెల్లడించారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
https://twitter.com/Ragavendraraoba