జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. శ్రీనగర్‌లోని రంగ్రెత్ ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.
సెంట్రల్ కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా రంగ్రెత్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులు, బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు.
ఆదివారం అవంతీపొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించారు. అవంతీపొరాలోని బారాగామ్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భ్రద్రతా బలగాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.