ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నకిలీ కరెన్సీ ముద్రించి..వాటిని చెలామణి చేసేందుకు ప్రయత్నించిన ముఠాను పెడన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూ ట్యూబ్ ద్వారా నకిలీ కరెన్సీని ఎలా తయారు చేయాలి. వాటిని ఎలా చెలామణి చేయాలి అనే అంశాలపై మూడు నెలలపాటు క్షుణ్ణంగా నేర్చుకుని పక్కాగా అమలు చేయాలనుకున్న వారికి పోలీసులు ఆదిలోనే చెక్ పెట్టారు.
పెడన పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మచిలీ పట్నం డీఎస్పీ షేక్ మసూంబాషా సోమవారం విలేకరులకు వెల్లడించారు. ప్రధాన సూత్రధారి ఇంటర్ చదివే విద్యార్థి, అతని తండ్రి కాగా మొత్తం ఎనిమిది మందిని మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు.
అలాగే వారి నుండి రూ.4 లక్షల నకిలీ కరెన్సీ, రూ. 32,700 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని మచిలీ పట్నం డీఎస్పీ షేక్ మసూంబాషా తెలిపారు.