ఏపీలోని పాఠశాలలకు ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆఈర్టీ) అకడమిక్ క్యాలెండర్‌లో పొందుపరిచింది.
క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయి. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. డిసెంబర్ 31న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు ఉంటాయని ఎస్‌సీఈఆర్టీ వివరించింది. మిషనరీ పాఠశాలలకు మినహా తక్కిన పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. 17వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. జనవరి 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ సెలవే.
స్కూళ్ల సెలవులు అయితే ప్రస్తుతానికి ప్రకటించారు కానీ.. ప్రస్తుతం భారత దేశాన్ని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. చాలా వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో వంద కేసులు దాటాయి. అయితే చాలా మంది నిపుణులు చెబుతున్న దాని ప్రకారం డిసెంబర్ చివరి నాటికి కేసుల సంఖ్య కాస్త పెరగవచ్చని అలాగే జనవరి మధ్యలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఫిబ్రవరి నాటికి తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉంటుంది అంటున్నారు. అదే పరిస్థితి నిజమైతే.. సంక్రాంతి సెలవుల తరువాత స్కూళ్లు తెరవడం చాలా కష్టంగా మారుతోంది.
ఈ ఏడాది కరోనా కారణంగా ఇప్పటికే సగం విద్యా సంవత్సరం వృధాగా పోయింది. చాలా ఆలస్యంగా స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. చాలా వరకు సిలబస్ పూర్తిగా వెనుకబడింది. ఇలాంటి సమయంలో స్కూళ్లకు ఎంత తక్కువ సెలవులు ఇస్తే అంతమంచిదని విద్యార్థుల తల్లి దండ్రులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు..ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఇలా అన్నీ భయపెడుతూనే ఉన్నాయి.