జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్నదాతలందరికీ తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైతుల పక్షాన ఆరు రోజులుగా దిల్లీలోనే ఉంటూ..ధాన్యం కొనుగోళ్లు విషయంలో కేంద్రం స్పష్టత కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
కేంద్రం విధానాల వల్ల రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వినూత్న విధానాలు, సహసోపేత నిర్ణయాలు తీసుకుంటేనే ప్రభుత్వాలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి తెలిపారు. అలాంటి నిర్ణయాలు, విధానాలు సీఎం కేసీఆర్ చాలా తీసుకున్నారని తెలిపారు. ఎన్నో సందర్భాల్లో కేంద్రమే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిందని గుర్తు చేశారు. అలాంటి కేంద్ర ప్రభుత్వం..ఇప్పుడు రాజకీయ పార్టీగా వ్యవహరించటం బాధాకరమన్నారు.
కేంద్రంలోని అనేక శాఖలు తెలంగాణ పురోగతిని ప్రశంసించాయి. కానీ వాళ్ల విధానాల వల్ల రైతులు బాధపడే పరిస్థితి వచ్చింది. ధాన్యంపై రెండ్రోజుల్లో నిర్ణయం చెప్తామని ఇంతవరకు చెప్పలేదు. రైతుల సమస్య పరిష్కారం కోసం దిల్లీలో పడిగాపులుకాస్తున్నాం. ప్రేమలేఖలు రాసేందుకు వచ్చినట్లు కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారు. రాష్ట్ర రైతుల కోసం ప్రధానితో కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడరని మంత్రి ప్రశ్నించారు.