పిల్లలకూ వ్యాయామం అత్యవసరం. ఎదిగే వయసులో కండరాలు, ఎముకలు బలపడటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. కానీ వ్యాయామం, శారీరక శ్రమను చాలా మంది పెద్దల వ్యవహారంగానే చూస్తుంటారు. మరి ఏ వయసు పిల్లలు వ్యాయామం చేయాలి? ఎంతసేపు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరేళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు పిల్లలు రోజుకు కనీసం గంట సేపు వ్యాయామం, శారీరకశ్రమ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం. ఇవీ వ్యాయామాలుగా ఉపకరిస్తాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయులను పెంచే నడక, పరుగు, ఈత, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, డ్యాన్స్ ఇలాంటివేవైనా ఎంచుకోవచ్చు.
అలాగే కాస్త కష్టమైన వ్యాయామాలను వారానికి కనీసం మూడు రోజుల పాటైనా చేసేలా చూసుకోవాలి. 3-5 ఏళ్ల పిల్లలనైతే రోజంతా చురుకుగా కదిలేలా, రకరకాల ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఎక్కువసేపు ఒకేదగ్గర కూర్చోకుండా చూసుకోవటం ముఖ్యం. చిన్నప్పుడే వ్యాయామం చేయటం అలవడితే అది జీవితాంతం కొనసాగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నప్పట్నుంచే వ్యాయామం పట్ల మక్కువను పెంచితే, దాన్ని క్రమం తప్పకుండా కొనసాగించేలా చేస్తే మున్ముందు మంచి ఆరోగ్యానికి బాటలు వేసినట్టే.
వ్యాయామం వల్ల కలిగే లాభాలు:
అధికబరువు ముప్పు తగ్గుతుంది.
రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువవుతాయి
ఏకాగ్రత, చదువుల్లో నైపుణ్యం పెరుగుతాయి