భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈ సందర్బంగా మేడ్చల్ లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత జాతి కీర్తించే బిడ్డ, భారత జాతి గర్వపడే బిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి 97వ జయంతి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం లో వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మహనీయుల విగ్రహాలు, జయంతులు, రాబోయే కాలం వారికి ఆదర్శంగా నిలుస్తాయి.
“చోటే మన్ సే కోయి బడ నహి హోత, టుటే మన్ సే కోయి కడ నహి హోత” నినాదంతో రాజకీయ పార్టీలు, నాయకుల గురించి ఎంతో గొప్పన చెప్పిన వ్యక్తి వాజ్పేయ్.. భారత దేశ ప్రధానిగా అన్ని కుల, మత, ప్రాంతాల మెప్పు పొందిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఈ దేశ చరిత్రలో అందరి చేత ప్రేమించబడ్డ ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి, అలాంటి నాయకుడి విగ్రహం మేడ్చల్లో ఆవిష్కరించడం ఎంతో గర్వకారణం అని రాజేందర్ పేర్కొన్నారు.