వసుందర..ఉద్యమ ప్రస్థానం ఎంత సుందరమైనదో!

0
76

వ‌సుంద‌ర అంటేనే తెలంగాణ ఉద్య‌మంలో చ‌దువుకున్న చైత‌న్య‌వంత‌మైన ఆడ‌బిడ్డ‌ల హ‌డావుడి. తెలంగాణ భ‌వ‌న్‌లో ఎప్పుడ‌న్నా ఉద్య‌మం వొడిదొడుకులు ఎదుర్కొన్న‌ప్పుడు, జ‌నం రాక సందోహం త‌గ్గిన‌ప్పుడు, వ‌సుంద‌ర గుంపులు గుంపులుగా గులాబి జెండాల‌తో అంద‌ర్ని పోగేస్తుండేది. ఎక్క‌డ క‌లిసినా, సుధాక‌ర్ గారు! మీ ఉద్య‌మం దుమ్ము రేపుతుంది సార్‌! ఉస్మానియాకు దీటు న‌కిరేక‌ల్ అంటుండే. జోష్ ఆమె ఇంటి పేరు క‌మిట్‌మెంట్ ఆ ఆడ‌బిడ్డ దేహసౌంద‌ర్యం.

ఏమోనండి! తెలంగాణ భ‌వ‌న్‌లో జోకుడు రాజ‌కీయాలు, ఆదిప‌త్య కులాల కుట్ర‌లు చీకాకు ప‌డుతుండే. నాక‌యినా, ఆమెక‌యినా, ఆ మాట‌కొస్తే చాలా మందికి నోరుకు ఇరాము లేని నాయిని న‌ర్స‌న్న‌నే చెప్పుకోవ‌డానికి, విసుక్కోవ‌డానికి, నీర‌సంగా చ‌ల్ల‌బ‌డ‌డానికి మొక్కుడుబండ.

ఎక్క‌డో దుబాయిలో ఉద్యోగం వ‌దిలి, రెక్క‌లు క‌ట్టుకొని, హైద‌రాబాద్‌లో వాలి, గులాబి కండువ క‌ప్పుకొని, 14 ఏండ్లు క‌ష్ట‌ప‌డ్డ వ‌సుంద‌ర‌కు ఏ గుర్తింపు రాలేదు. ఆ మాట కొస్తే చాలా మందికి అదే ప‌రిస్థితి అందుకే మ‌న వ‌సుంద‌ర ఒక వ్య‌క్తి పేరు కాదు, తెలంగాణ ఉద్య‌మంలో స‌ర్వ‌నామం.
తెలంగాణ వ‌చ్చినంక‌, కేసియార్ అధికారంలోకి వ‌చ్చినంక కూడా రెడ్ కార్పెట్ తెలంగాణ ద్రోహులకే గానీ, వ‌సుంద‌ర లాంటి వాళ్ళ‌కు ప‌చ్చ‌జెండా లేద‌ని ఎంత నొచ్చుకుందో మాలాంటి వాళ్ళ‌కు తెలుసు.

ఎంతో ఓపిక‌తో జ‌రిగిన ప‌రిణామాల నుండి ఎంతో నేర్చుకుంది వ‌సుంద‌ర‌. 14 ఏండ్ల టి.ఆర్‌.య‌స్ అనుబంధం వ‌దిలి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెలోకి వెళ్ళింది వ‌సుంద‌ర‌. తెలంగాణ ఉద్య‌మ వేదిక‌గా ఉద్య‌మ‌కారుల కోసం, సామాజిక న్యాయం కోసం నేను గొంతు విప్పినప్పుడు, అనేక అభిప్రాయాలు, భ‌విష్య‌త్తు రాజ‌కీయ ప్ర‌యాణం గురించి ఆమె ప్ర‌స్తావించేది. ఒక వైబ్రంట్ వాతావ‌ర‌ణం కాంగ్రెస్‌లో క్రియేట్ చేసే ప్ర‌యాణంలో అమె క్యాన్స‌ర్‌కు గురి కావ‌డం, అది త‌గ్గిన‌ట్లే త‌గ్గి తిర‌గ‌బెట్టి ఉద్య‌మ బిడ్డ‌ల‌ను పొట్ట‌న పెట్టుకుంది. ఎదిగి వ‌చ్చిన నాయ‌కులు నేల రాలితే గ‌ర్భ‌శోకం అనుభ‌విస్తున్న త‌ల్లితీరుగా ఉండాలి ఏ రాజ‌కీయ పార్టీ అయినా, క్రిస్టియ‌న్ మైనారిటీ హ‌క్కుల కోసం ఆమె నిరంత‌రం పోరాడుతూ, ఆ వ‌ర్గాల‌ను తెలంగాణ ఉద్య‌మంలో నిల‌బెట్ట‌డం ఆమెకు ఒక శాశ్వ‌త‌గౌర‌వం. కాంగ్రెస్‌కు పండుగ‌కు బ‌ట్ట‌లు పెట్టి, క్రిస్‌మ‌స్ కేకు చేసి తాయిలాలు ఇచ్చే పార్టీ కంటే మైనారిటీల హ‌క్కుల‌ను గౌర‌వించే పార్టీలోకి క్రిస్టియ‌న్ స‌మాజాన్ని తీసుకొచ్చే పెద్ద భాధ్య‌త త‌న మీద వేసుక‌న్నా సుడిగాలిలా క్యాన్స‌ర్ చుట్టు ముట్టి ఎత్తుకు పోయింది. ప‌ర లోకం విశ్వాసం, ఇహ లోకంలో ప్ర‌జా విశ్వాసం పొంద‌డం మ‌హాభాగ్యం.

ఏ పార్టీలు ఆమెకు ఎంత విలువ, అవ‌కాశం ఇచ్చిండ్ర‌నే చ‌ర్చ కంటే, ప్ర‌తిప‌క్షంగానైనా ప్ర‌జ‌ల కోసం ఉద్య‌మం చేయాల‌న్న వ‌సుంద‌ర త్యాగాల పునాదుల మీద వ‌చ్చిన రాష్ట్రంలో పెద్ద గుర్తింపు రాకుండానే వెళ్ళిపోయింది. ఆమె కోసం సంతాపం తెలిపే తీరిక ఎవ‌రికి లేక‌పోయినా, ఆమె శాశ్వ‌తంగా తెలంగాణ చ‌రిత్ర‌లో భాగ్య‌మ‌య్యింది. తెలంగాణ‌కు అక్క‌ర‌కు రాని వాళ్ళ‌కోసం ప‌రుగులు పెట్టే త్యాగాల పునాదుల ఉద్య‌మ పార్టీ మంత్రులెవ్వ‌రు వ‌సుంద‌ర‌పార్ధీవ దేహాన్ని చూడ‌డానికి రాలేదు. ఎవ‌రి లెక్క‌లు వారివి.
తెలంగాణ ఇంటి పార్టీ నిబ‌ద్ద‌త‌తో నివాళులు అర్పిస్తుంది.

ఇట్లు
డా. చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు

https://youtu.be/SVP3IMxs6zg