Politics- సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి

Rewanth Reddy wrote an open letter to CM KCR

0
104

టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.  ఈ లేఖలో ఆయన బదిలీలు, కొత్త జోనల్ విధానం గురించి ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనో వేదనకు గురి చేస్తున్నాయని సొంత జిల్లాలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడిందని అన్నారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం డిసెంబర్ 6న జీవో నెంబర్ 317ను జారీ చేసింది. తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉమ్మడి జిల్లా యూనిట్ గా సీనియార్టీనే ప్రతిపాదికగా తీసుకొని సీనియర్లకు వారి అప్షన్ మేరకు పోస్టింగ్ లు ఇస్తున్నారు. దీంతో దాదాపు 20-30 ఏళ్లు స్థానికేతరులుగా జీవించాల్సిన పరిస్థితి.

బదిలీల కారణంగా సొంత జిల్లాను ఉన్న పళంగా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో రిటైర్మెంట్ వరకు ఆ జిల్లాలోనే బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి. తిరిగి సొంత జిల్లాకు వచ్చే మార్గమే లేదు. సీనియారిటీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను, ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే విధంగా విడుదల చేసిన జీవో 317ని ప్రభుత్వం ఉప సంహరించుకోవాలి.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలతో చర్చించిన తర్వాత రూపొందించే నూతన గైడ్ లైన్స్ ఆధారంగా బదిలీలు చేపట్టాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు ఇప్పటి వరకు జీవో నెంబర్ 3 ప్రకారమే జరిగాయి. కాబట్టి ప్రస్తుతం కూడా జీవో నెంబర్ 3 ఆధారంగానే బదిలీలు చేపట్టాలి. అవసరమైతే జూనియర్ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలి. ఉపాధ్యాయుల కేటాయింపునకు కౌన్సిలింగ్ విధానాన్ని అనుసరించాలని రేవంత్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.