కొత్త సంవత్సరానికి, సంక్రాంతికి బట్టలు కొనాలనుకుంటున్నారా? ప్రతీ పండుగకు కొత్త దుస్తులు కొనే అలవాటు ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. దుస్తులపై జీఎస్‌టీ పెంపును వాయిదా వేసినట్లు తెలిసింది. వస్త్రాలపై జీఎస్‌టీని 12 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై కేంద్రం వెనకడుగు వేసినట్లు సమాచారం. వచ్చే జీఎస్టీ మండలి భేటీలో ఈ విషయంలో అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.
దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 46వ జీఎస్టీ మండలి సమావేశమైంది. ఈ భేటీలో కొన్ని వస్తువులపై పన్ను రేట్ల సవరణ సహా పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇటీవల చెప్పులు, దుస్తులపై 5 శాతం ఉన్న జీఎస్‌టీని 12శాతానికి పెంచారు. ఈ రేట్లు 2022 జనవరి 1న అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీనిపై చేనేత కార్మికులు, వ్యాపారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రేట్లు పెంచడం వల్ల చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నది వారి వాదన. ఈ నేపథ్యంలో దుస్తులపై పన్ను పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ధరలతో సంబంధం లేకుండా అన్ని రకాల పాదరక్షలపై 5 శాతం ఉన్న జీఎస్టీ 12 శాతానికి పెంచింది. ఇది జవనరి 1న అమల్లోకి రానుంది.