దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ఇకపై ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది.
కరోనా థర్డ్ వేవ్ ముప్పు దృష్ట్యా పెద్ద ర్యాలీలపై నిషేధం విధించాలని కోరుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లేఖ రాసింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది. ఇకపై వర్చువల్ ర్యాలీలే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ డబ్బుతో వివిధ కార్యక్రమాలను ప్రారంభించకుండా, రాజకీయ ప్రకటనలు చేయకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది. యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ సీనియర్ నేతలు చర్చించి బహిరంగ ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నాయి .