ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులకు శుభవార్త..ఎన్నికల వ్యయ పరిమితిని పెంచిన ఈసీ

0
88

దేశవ్యాప్తంగా పార్ల‌మెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు చేయ‌డానికి వ్య‌య ప‌రిమితిని కేంద్ర ఎన్నిక‌ల సంఘం పెంచింది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను గురువారం రాత్రి కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతోపాటు చాలా రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానానికి ఎన్నికల వ్యయ పరిమితిని రూ.95 లక్షలుగా, అసెంబ్లీ స్థానం ఖర్చును రూ.40 లక్షలుగా నిర్ణయిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల సవరణ నిబంధనలు-2022 పేరిట విడుదల చేసిన ఈ నిబంధనలు అధికారిక గెజిట్‌లో ముద్రించిన నాటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.

శాస్త్రీయ అధ్యయన తర్వాతే ఎన్నికల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల ఖర్చును 2014 తర్వాత 2020లో ఎలాంటి అధ్యయనం లేకుండా తాత్కాలిక ప్రాతిపదికన 10% పెంచింది. ఎన్నికల వ్యయంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుంది.