కొత్తగూడెం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవపై మండిపడ్డారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. గత 15 ఏళ్లుగా రాఘవ అమాయక ప్రజలను బెదిరించడం, వేధించడం, సెటిల్‌మెంట్ చేయడం, మహిళలను లొంగదీసుకోవడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. తన తండ్రి పదవిని, పార్టీని అడ్డంపెట్టుకుని పోలీస్ అధికారులను తనకనుకూలంగా మలచుకుని ఈ అక్రమాలను కప్పిపుచ్చుకుంటున్నాడు.
రామకృష్ణ కుటుంబం యావత్ రాఘవ వేదింపుల వల్లే ఆత్మహత్యలకు పాల్పడిందనేది స్పష్టం. నిసిగ్గుగా అనేక దారుణాలకు పాల్పడుతున్న రాఘవను పోలీసులు అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం వహించడం సరైంది కాదు. తక్షణమే రాఘవపై రౌఢషీీట్ ఓపెన్ చేయడంతో పాటు, కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే రాఘవ వేదింపుల వల్ల కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇటీవల రామకృష్ణ కుటుంబం యొక్క ఆస్థుల పంపకాల్లో కూడా తలదూర్చి నీ భార్యను హైదరాబాదుకు తీసుకొస్తేనే ఆస్థుల సమస్య పరిష్కారమవుతుందని, లేదంటే నీ ఆస్థులు నీకు దక్కకుండా చేస్తానని రామకృష్ణను బెదిరించాడు.
ఈ అవమానాన్ని భరించలేక రామకృష్ణతో పాటు, భార్య, కూతురు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారని తన మరణ వాంగ్మూలం తేటతెల్లం చేస్తున్నది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనా పోలీసులు రాఘవను అరెస్టు చేయకుండా మీనమేషాలు లెక్కపెట్టడం క్షంతవ్యం కాదు. వెంటనే అతన్ని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని, తన కుమారుడు చేస్తున్న ఈ దుశ్చర్యలన్నింటికీ శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు పూర్తి బాధ్యత వహించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తుందన్నారు.