‘ఇంగ్లీష్ మీడియం స‌రే..ముందు బ‌డులు బ‌తుక‌నీయండి’!

0
86

సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ విమర్శలు గుప్పించారు. నిద్ర‌లో జోగుతున్న పాల‌న‌కు జోష్ నింపిన‌ట్లు మంత్రివ‌ర్గ స‌మావేశంలో పెద్ద పెద్ద ప్ర‌ణాళిక‌లు, హామీలు ప్ర‌క‌టించ‌డం, మ‌రునాటికి బుట్ట దాఖ‌లు చేయ‌డం కేసీఆర్ కు ప‌రిపాటి అయ్యింది. ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న‌కు కొత్త చ‌ట్టం, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల్లో ఫీజుల నియంత్ర‌ణ ఇత‌ర అద్య‌య‌నాల‌కు స‌బితా ఇంద్రారెడ్డి అధ్య‌క్ష‌త‌న క‌మిటీ వేస్తున్న‌ట్లు ఇచ్చిన ప్ర‌క‌ట‌న తెలంగాణ‌లో కుదేలయిన విద్యావ్య‌వ‌స్థ‌ను ఎప్ప‌టికి పైకి లేపుతుందో స్ప‌ష్ట‌త‌ను ఇస్తే బాగుండేది.

ఐదు వేలు పైబ‌డిన పాఠ‌శాల‌లు ప్ర‌భుత్వ విధానాలతో మూత ప‌డినాయి. ఇప్ప‌టి క‌మిటీకి నిర్ధేశించిన ప‌నిని మంత్రి వ‌ర్గం ప‌లుసార్లు ప్ర‌స్తావించింది. మాతృభాష‌తో తెలుగుకు ప్రాధాన్య‌త త‌గ్గ‌కుండ ఇంగ్లీష్ మీడియంకు ఎప్పుడో ప‌చ్చ జెండా ఊపినా, టీచ‌ర్ల నియామ‌కం, ఇంగ్లీష్ భోద‌న ట్రైనింగ్ ఒక్క అడుగు క‌ద‌ల‌కుండా అదే పాట అందుకోవ‌డం నయ‌వంచ‌న‌నే అవుతుంది.

ఇప్పుడు మ‌న ఊరు -మ‌న బ‌డి ప్ర‌ణాళిక‌తో 26,065 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో 19,84,167 మంది విద్యార్ధుల‌కు 7,289 కోట్లు ఖ‌ర్చుతో డిజ‌టైలేజేష‌న్‌, మీడియం త‌ర్పీదు. క్షేత్రంలో అమ‌లుకు రూట్‌మ్యాప్ ప్ర‌క‌టించ‌కుండా, వేలాది మంది ఉపాద్యాయుల బ‌దీల‌లో 317 జీవో గంద‌ర‌గోళం సృష్టించి, మెమోరాండం ఇస్తామంటే అరెస్టులు చేసి ఎట్ల ముందుకు వెళ్తారో కేసీఆర్ చెప్పాలి.

మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న క్రింద ఈ ఏడేండ్ల‌లో ఎన్ని స్కూళ్ళ‌లో ఏ ప‌నులు చేశారో ఇప్ప‌టికే వంద‌లాది స‌ర్కారీ బ‌డుల‌లో బాలిక‌లు టాయిలెట్స్ కోసం క్యూ క‌ట్ట‌డ‌మే తెలియ‌జేస్తుంది. కోవిడ్ నేపథ్యంలో బ‌డులు, క‌ళాశాల‌లో దీర్ఘ‌కాల మూసివేత అన‌ర్ధ‌మ‌ని విజ్ఞులు చెప్పినా విన‌రు. బార్లు, సినిమా టాకీసులు, రాజ‌కీయ స‌భ‌ల్లో జ‌నాల స‌మీక‌ర‌ణ యధావిధిగా కొన‌సాగిస్తూనే త‌మ‌ద్వంద ప్రాధాన్య‌త‌లు బ‌హిర్గతం చేస్తారు.

ఇప్ప‌టికే కార్పోరేట్ విద్య‌, వైద్యం క‌రోనా బూచితో మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్న వేళ, యాత్రికంగా జ‌రిగే మంత్రివ‌ర్గ స‌మావేశాల‌తో తెలంగాణకు ఏమి వొరుగ‌ద‌ని కేసీఆర్ గ్ర‌హించాలి. విద్యుత్ దుర్వినియోగాన్ని, నియ‌తి లేని వృదాను అభివృద్ది సూచిక‌గా ఎత్తి చెప్పే ఈ ప్ర‌భుత్వం, అనేక స్వీయ ప్ర‌యోజ‌న, ఏక‌ప‌క్ష‌ కార్య‌క్ర‌మాల్లో, ప‌నుల్లో కోట్లాది రూపాయ‌ల ప్ర‌జా ద‌నం వౄదాచేసి మూడు ల‌క్ష‌ల కోట్లు మించిన అప్పులు చేసింది.

జీతాలు ఇవ్వ‌ని స్థితి నుండి, బ‌డులు మూసే తిరోగ‌మ‌నం నుండి ఇంగ్లీష్ మీడియం వ‌ల్లె వేయ‌డంతో ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, విద్యావ్య‌వ‌స్థ మెరుగు కోసం విద్యావేత్త‌ల‌ను క‌మిటీగా ఏర్ప‌ర్చి కార్య‌చ‌ర‌ణ చేప‌ట్టాల‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రికి గుర్తు చేస్తున్నాం.

ఇట్లు
డా. చెరుకు సుధాకర్
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు