పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి సినిమా చేయనున్నానంటూ వస్తున్న వార్తలపై డైరెక్టర్ మారుతి వివరణ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయని చెప్పడం సహా ఇతర వివరాల్ని వెల్లడించారు. ఓ హారర్ కామెడీ చిత్రాన్ని తీయనున్నారని.. దానికి ‘రాజా డీలక్స్’ టైటిల్ కూడా ఖరారు చేశారని.. డీవీవీ దానయ్య నిర్మించే అవకాశం ఉందని అందరూ చెప్పుకొన్నారు.
ఇప్పుడు సదరు వార్తలపై మారుతి స్పందించారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వాటంతట అవే బయటకు వస్తాయని అప్పటి వరకూ వేచి ఉండాలని స్పష్టం చేశారు. “నా భవిష్యత్తు ప్రాజెక్ట్‌లు, వాటి టైటిల్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఇతర తారాగణంపై ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, సమయమే అన్నింటినీ బయటపెడుతుంది. అప్పటి వరకూ వేచి ఉండండి. ఒక దర్శకుడిగా నన్ను ఎంతో సపోర్ట్ చేస్తోన్న వారందరికీ ధన్యవాదాలు. బయట కరోనా తీవ్ర రూపం దాల్చింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి” అని మారుతి చెప్పాడు.
కాగా నేటితరం యువతను ఆకర్షించే విధంగా విభిన్న ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించి కెరీర్‌లో మంచి పేరు సొంతం చేసుకున్నారు దర్శకుడు మారుతి. ‘మంచి రోజులొచ్చాయి’ చిత్రంతో మిశ్రమ స్పందనలు అందుకున్న ఆయన ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ పేరిట ఓ చిత్రాన్ని తీస్తున్నారు.