తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన కూడా కొనసాగించాలని ఆదేశించింది. ఈనెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలంది. సమ్మక్క జాతరలో కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలని సూచించింది. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి హైకోర్టు సూచనలు చేసింది.
‘ఫిబ్రవరి 20వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు.. ఆన్‌లైన్ బోధన కొనసాగించండి. హైదరాబాద్లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాల్సిందే. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని పాజిటివిటీ రేటు 3.40 శాతం ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీలో 4.64 శాతం, మేడ్చల్‌లో 3.76 శాతం పాజిటివిటీ రేటు ఉందని నివేదికలో పేర్కొన్నారు.