తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో చాయిస్ పెంచేందుకు సిద్ధం అవుతోంది విద్యాశాఖ. ఈ మేరకు ఆరు సంప్రదాయ యూనివర్సీటీల వీసీలతో శనివారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి, ఉపాధ్యక్షుడు వి. వెంకట రమణ తదితరులు వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా డిగ్రీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల్లో సెక్షన్ బి లో ఏ లేదా బీ రాయండి అని కాకుండా.. ఇచ్చిన ప్రశ్నిల్లో మీ కిస్టమైన వాటికి సమాధానాలు రాయండి అని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. దాని వల్ల విద్యార్థులకు ఛాయిస్ పెరుగుతుందని సమావేశం నిర్ణయం తీసుకుంది.
పరీక్ష సమయం మాత్రం 3 గంటలే ఉండనుంది. డిగ్రీ మొదటి సెమిస్టర్ కు ఈ నెల 17 వరకే తరగతులు జరుపుతారు. 18 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు సంసిద్ధత సెలవులు,ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఇక ఈ నెల 28 వ తేదీ నుంచి మార్చి 24 వ తేదీ వరకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.