సంతానం కోరుకునే మహిళలు తమకు పండంటి అబ్బాయి లేదా అమ్మాయి పుట్టాలని కలలు కంటారు. కొందరైతే తమకు కవల పిల్లలు పుట్టాలని ఆశిస్తుంటారు. 35 ఏళ్లు దాటితే కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. కాబట్టి అప్పటివరకు ఆగితే కచ్చితంగా కవలలు పుడతారని భావిస్తుంటారు. అయితే ఈ ఆలోచన సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మహిళల్లో 25 ఏళ్ల నుంచే అండం నాణ్యత తగ్గుతూ వస్తుందని 30 తర్వాత అది మరింత క్షీణిస్తుందని అంటున్నారు నిపుణులు. 35 తర్వాత సంతానం కోసం ప్రయత్నిస్తే జన్యు లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం ఉందని తెలిపారు. ఒకప్పుడు ట్విన్స్ పుట్టడం అనేది చాలా తక్కువని.. 100-80 ప్రసవాలలో ఒకరికి కవలలు పుట్టడం జరిగేదని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ, కెరీర్ ప్రెజర్ వల్ల చాలా మంది ఫెర్టిలిటీ సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారని..ఈ కారణంగా కవలలు పుట్టే అవకాశాలు పెరిగాయన్నారు.
ఒకవేళ ఫెర్టిలిటీ సెంటర్ల ద్వారా కాకుండా సహజంగా గర్భం దాల్చాలంటే 35 ఏళ్లలోపే సరైనదని సూచిస్తున్నారు. కవల పిల్లలు కావాలంటే కొన్ని మందులు వాడొచ్చు, కానీ దాని వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రీ టర్మ్ డెలివరీస్ ఎక్కువ జరుగుతాయని.. అంతేకాకుండా తల్లికి అనేమియా, బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పుట్టింది ఒకరైనా బిడ్డ ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని.. కవలల విషయంలో రిస్క్‌లు ఉండే అవకాశాలు ఎక్కువ అని పేర్కొన్నారు.