తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యారు. ఆయన స్వయంగా తెలంగాణలో పర్యటిస్తుండడం గమనార్హం. దీనితో తెలంగాణ రాజకీయాల్లో పీకే హాట్ టాపిక్ అయ్యారు. గోవా ఎన్నికల అనంతరం పీకే తెలంగాణకు వచ్చారు. నిన్న (శనివారం) సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తో ఆయన గజ్వేల్ లో పర్యటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఇప్పటి నుంచి ప్లాన్ సిద్ధం చేస్తుంది. దీనిని బట్టి చూస్తే కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
ఏ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో తెలుసుకోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఎంతవరకు సానుకూలత ఉందనే అంశంపై కూడా సమాచారం తెప్పించుకున్నట్టు సమాచారం. నిఘా వర్గాల నివేదికలు, వివిధ సర్వేల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరును అంచనా వేస్తున్నారు. చాలాచోట్ల విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరి విపక్షాలకు అనుకూలంగా మారకూడదనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించి ఇతర పార్టీల నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో పీకే టీం కలవడం చర్చనీయాంశంగా మారింది.
మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత పీకే తన వ్యూహాలకు పదును పెట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఒక దశ ప్రాథమిక సర్వే కూడా ఐప్యాక్ బృందం సభ్యులు పూర్తి చేసినట్లు పొలిటికల్ వర్గాలు తెలుపుతున్నాయి. దీనిపై కూడా పీకే పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు సూచనలు చేయనున్నారని విశ్వసనీయ సమాచారం.