ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రభావం ధరలపై పడింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట నూనె ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇక తాజాగా శ్రీలంకలో పెట్రోల్ ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అంతగా పెరిగాయి చమురు ధరలు.
శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని ఎల్‌ఐవోసీ తెలిపింది. ప్రస్తుతం శ్రీలంక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.57కి తగ్గింది. శ్రీలంక రూపాయి పడిపోవడం గత వారం రోజుల్లో ఇది రెండో సారి. నెల రోజుల వ్యవధిలోనే శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి.
తాజాగా శ్రీలంకలో అయితే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ఎల్‌ఐవోసీ (LIOC) ప్రకటించింది. ఈ మేరకు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్‌పై రూ.75 పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరను పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర రూ.254కి చేరుకోగా, లీటర్ డీజిల్ ధర రూ.214కు చేరుకుంది. పెరిగిన ధరలతో బండ్లతో రోడ్డెక్కడానికి జనాలు జంకుతున్నారు.