విశ్వాసానికి మారుపేరు అంటే మనకు గుర్తొచ్చే పెంపుడు జంతువు పేరు కుక్క. వాటిని తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు కొంతమంది. వాటికి ఏ చిన్న సమస్య కలిగినా అల్లాడిపోతుంటారు. అయితే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ పెంపుడు కుక్కకు ఏకంగా సీమంతం చేశారు ఓ దంపతులు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే..మెచ్చేరికి చెందిన స్టూడియో యజమాని మురుగన్, సుశీల దంపతులు ఉన్నారు. వీరికి హెమరాణి అనే కూతురు ఉంది. ఆమె ఎంతో ఇష్టంగా రెండు కుక్కలను తీసుకొచ్చి, పెంచుకుంటోంది. పొమేరియన్ రకానికి చెందిన హైతి అనే మగ శునకాన్ని, సారా అనే ఆడ కుక్కకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు.
అయితే సారా గర్భం దాల్చడంతో సీమంతం చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఆహ్వాన పత్రికలు ముద్రించి, తమ బంధు మిత్రులను ఆహ్వానించారు. ఆ కుక్క సీమంతానికి మహిళలను పిలిచి వారికి మిఠాయిలు, జాకెట్ బట్ట, గాజులు, తాంబూలం వంటివి సమర్పించుకున్నారు. వారు సంతోషం వ్యక్తం చేస్తూ కుక్కను ఆశీర్వదించారు. కుక్కకు సీమంతం చేయడం మాత్రం స్థానికంగా చర్చనీయాంశమైంది.