రుణాల పేరుతో ఘరానా మోసం..అలాంటి వారే వీరి టార్గెట్..తస్మాత్ జాగ్రత్త!

0
104

రోజురోజుకు కేటుగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కొందరు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతుండగా మరికొందరు ఇతర మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వీరి మోసాలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా ఏపీలో హోమ్ ఫైనాన్స్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా శ్రీ శ్రీనివాస హోమ్ ఫైనాన్స్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. కొత్త సంస్థల పేరుతోనూ ఘరానా మోసాలకు పాల్పడడంతో బాధితులు గుర్తించలేదు దీనితో  డబ్బులు పోగొట్టుకున్నవారు లబోదిబోమంటున్నారు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం, ఒప్పిచర్ల గ్రామానికి చెందిన 40 మంది వద్ద 4 వేల రూపాయల చొప్పున కట్టించుకోని ఇందులో ఓ పదిహేను మందికి నాసిరకం గ్రైండర్లు ఇచ్చారు.

మాది కొత్త సంస్థ ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లం ఉండడంతో పది మందిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి రూ.4000 కట్టించుకున్న తర్వాత ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు రుణం మంజూరు చేస్తామని నమ్మబలికి ఒక్కో గ్రామంలో లక్షలు వసూలు చేశారు. శ్రీ శ్రీనివాస హోమ్ ఫైనాన్స్ పేరుతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసి పరారయ్యారు.

గుంటూరు జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో నివసించే దళిత సామాజిక వర్గాలకు చెందిన రోజువారీ కూలీలను వీళ్లు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో కూడా సుమారు 50 మంది వద్ద ఒక్కొక్కరి నుంచి 4 వేల రూపాయల చొప్పున వసూలు చేసినట్టు తెలిపారు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో రోజువారి కూలీలు అప్పులు తెచ్చి మరి కట్టి మోసపోయి బయటకు చెప్పుకోలేక బాధితులు వాపోతున్నారు.