నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడి (ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్) వరుసగా మూడో రోజు విచారించింది. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి, పలు కీలక విషయాలపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మూడు రోజుల్లో రాహుల్‌ను ఇప్పటికే 24 గంటలకు పైగా విచారించారు అధికారులు.
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా నిరసిస్తున్నారు. దిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు ఎదుట బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విచారణ పేరుతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పైన రాజకీయ కక్ష సాధింపు చర్యలతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.
రోజుల తరబడి, గంటల విచారణలు చేయడాన్ని నిరసిస్తూ, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు చొచ్చుకొని వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను తీవ్రంగా కొట్టి అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండించారు. దీనితో ఏఐసీసీ పిలుపు మేరకు రేపు ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ వద్ద భారీ నిరసన ప్రదర్శన ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ లోని పీజేఆర్ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు ప్రదర్శన ఉంటుంది. కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు.