నేటి నుంచే ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు..వెంకయ్య వారసుడు ఎవరో?

0
148

నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈరోజు నుంచి జులై 19 వరకు నామినేషన్లు సమర్పించే అవకాశం కల్పించనున్నట్లు ఈసీ తెలిపింది. పోలింగ్ అనివార్యమైతే.. ఆగస్టు 6వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. కౌంటింగ్ కూడా అదే రోజు జరగనుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

ఉప రాష్ట్రపతికి పోటీ చేసే అభ్యర్థి నిర్ణీత ఫార్మాట్‌లో నింపి, ఎలక్టోర్‌ సభ్యుల్లో 20 మంది ప్రతిపాదించాల్సి ఉండగా.. అలాగే మరో 20 మంది ఆ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు నామినేషన్లు దాఖలు చేసుకునే వీలుంది. ఎన్నికల సెక్యూరిటీ డిపాజిట్ రూ.15వేల డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో 788 మంది సభ్యులు ఓటు వేయనున్నారు.

ఈ నేపథ్యంలో తర్వాత ఉపరాష్ట్రపతి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు వారసుడిగా ఎవరు వస్తారనే చర్చ మొదలైంది. ఉపరాష్ట్రపతిగా ఐదేళ్ల కాలంలో అత్యంత సమర్థంగా సేవలందించారు వెంకయ్య. పెద్దల సభ ఛైర్మన్​గా ఆయన హయాంలో రాజ్యసభ పనితీరు ఎన్నడూ లేని విధంగా నమోదైంది. మరి వెంకయ్య తరువాత ఆయన వారసుడు ఎవరో చూడాలి.