తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. ఝార్ఖండ్‌పై రెండురోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి.
ఝార్ఖండ్‌పై రెండురోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మధ్యప్రదేశ్ పైకి విస్తరించింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు బంగాళాఖాతంపై మరో ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడింది. రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
మరోవైపు గోదావరికి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శ్రీరాంసాగర్‌కు ఎగువ నుంచి వరద ఎక్కువవుతోంది. మంగళవారం నాటికి 12,963 క్యూసెక్కులు వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.