మంకీపాక్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే..!

0
95

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరస్ ల కల్లోలం ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తుంది. ఓ వైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్లు, ఇవి చాలవు అన్నట్టు ఇప్పుడు మంకీపాక్స్. ఇవన్నీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్‌ గురించి 5 విషయాలు తప్పకుండ తెలుసుకోవాల్సి ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మంకీపాక్స్ అంటే ఏంటి?

ఇదొక ఒక వైరల్‌ డిసీజ్‌. ఇది జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి కూడా సంక్రమించే అవకాశం కూడా ఉంది. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకనే ఈ వైరస్ కు మంకీపాక్స్ అని పేరుపెట్టారు.

లక్షణాలు ఇవే..

జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి,  అలసట వంటివి మంకీపాక్స్ అత్యంత సాధారణ లక్షణాలు. ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపించడానికి కనీసం రెండు నుండి మూడు వారాలు పడుతుంది.

ఎలా రక్షించుకోవాలి..?

మంకీపాక్స్‌ సోకిన లేదా అనుమానిత వ్యక్తులకు దూరంగా ఉండాలి. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లడం మంచిది కాదు. తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి.  మాస్క్ ఖచ్చితంగా ధరించాలి. చనిపోయిన లేదా బతికున్న ఎలుకలు, ఉడతలు, కోతులు, చింపాజీలను నేరుగా తాకకూడదు. చర్మ సంబంధిత వ్యాధులు, జననేంద్రియ వ్యాధులతో బాధపడుతున్న  వ్యక్తులతో చాలా దూరం ఉండాలి.

ఇలా వ్యాపిస్తుంది..?

ఇది జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన జంతువు గాయాన్ని తాకినా, కాటు కారణంగా సోకే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఎక్కువగా మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తోంది. లైంగిక సంపర్కం ద్వారా మంకీపాక్స్‌ వ్యాపించే అవకాశం కూడా ఉందంటున్నారు వైద్య నిపుణులు. వైరస్ సోకిన వ్యక్తులపై పరిశోధన ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంకీపాక్స్ దద్దుర్లు ఉన్న వారితో సన్నిహితంగా ఉండటం ద్వారా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఎక్కువగా వ్యాపిస్తుంది.

ట్రీట్మెంట్‌  ఉందా..? 

తప్పనిసరిగా ట్రీట్మెంట్‌ అంటూ లేనప్పటికీ నియంత్రించడానికి మాత్రం వైద్యులు యాంటీవైరల్‌ మందులను ఇస్తున్నారు. కరోనా సమయంలో అనుసరించిన సామాజిక దూరం, మాస్కింగ్, మెరుగైన వెంటిలేషన్ వంటి జాగ్రత్తలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మంకీపాక్స్ లక్షణాలు వెంటనే వైద్యులను సంప్రదించాలి.